అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాడు వైయస్ కూడా జగన్ లా ప్రవర్తించలేదని విమర్శించారు. 

గుంటూరులో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. 1994 ముఖ్యమంత్రులను, ఎంతోమంది ప్రభుత్వాలను చూశానని కానీ ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. భవిష్యత్ లో కూడా చూడబోమన్నారు. 

పొలిట్ బ్యూరోలో ఎన్నికల ఫలితాలు, పార్టీ ప్రక్షాళనపై చర్చించినట్లు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కూడా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏడుగురు టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. అందుకే జగన్ ప్రభుత్వానికి కక్ష సాధింపు ప్రభుత్వంగా ముద్రపడిందని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.