కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021పై అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే రాష్ట్రానికి సరైన కేటాయింపులు జరగలేదని ఆయన విమర్శించారు.

ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా, పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ లేదని యనమల ఆరోపించారు. కరోనా వల్ల దెబ్బతిన్న రంగాలు తిరిగి కోలుకునే విధంగా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని రామకృష్ణుడు మండిపడ్డారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నిధులు కేటాయించలేదని.. అందువల్ల యువతలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బడ్జెట్‌లో కనీసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పేర్లు కూడా ఎక్కడా ప్రస్తావించలేదని యనమల గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ రాష్ట్రానికి చేయూతనిచ్చేలా ఎలాంటి అంశాలనూ బడ్జెట్‌లో ప్రస్తావించలేదని రామకృష్ణుడు మండిపడ్డారు

Also Read:మోదీని దువ్వుతున్నావనుకున్నాం... ఏపీని అమ్మేసారా!: విజయసాయిపై అయ్యన్న సెటైర్లు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ యాత్రలు చేస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని చెప్పిన సీఎం.. ఇప్పుడు హోదా గురించి ఎందుకు అడగటం లేదని యనమల నిలదీశారు.

తనపై ఉన్న కేసుల కోసమే జగన్‌ ఢిల్లీ వెళ్లివస్తున్నారని.. అందుకే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ అంటే చిన్నచూపు ఏర్పడిందని యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు.

విభజన చట్టం అమలుకు సంబంధించి బడ్జెట్‌లో ఎటువంటి అంశాలూ ప్రస్తావించలేదని.. వైసీపీ ఎంపీలు సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి దుయ్యబట్టారు.