అమరావతి: అధికార వైసిపి ఎంపీలు, ప్రభుత్వం చేతకానితనం వల్లే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిందని టిడిపి నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా వేదికన మండిపడ్డారు. పార్లమెంట్ లో పీఎం మోదీ వెనకాల సీట్లో కూర్చున్నానంటూ ప్రచారం చేసుకోవడం కాదని... రాష్ట్రానికి ఏం తీసుకువచ్చారో చెప్పాలంటూ నిలదీశారు. 
 
''ప్రధాని మోడీ వెనకాల కూర్చున్నా, నేను గొప్పవాడిని అంటూ, నీ పీఆర్ టీంతో డబ్బాలు కొట్టుకుంటే, సర్లే రాష్ట్రం కోసం భారీగా నిధులు తేవటానికి, ఆయన వెనకాల కూర్చుని దువ్వుతున్నావ్ అనుకున్నాం. నువ్వు కాళ్ళు పట్టేది, కాకా పట్టేది, నీ కేసులు కోసం అని, ఈ రోజుతో తేలిపోయింది. కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్రానికి కనీసం రూపాయి తీసుకుని తేలేని నువ్వు, నీ ఎచ్చు కబురులు ఎందుకు ? 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులు కలిసి, మీ కేసుల కోసం ఏపిని అమ్మేసారా ఏంటి?'' అని అయ్యన్న ప్రశ్నించారు.

 ''ఆ జడ్జిను తప్పించండి, ఈ జడ్జి మీద కేసు వేయండి, చంద్రబాబు పై సిబిఐ కేసు వేయండి అంటూ, రాజకీయ కక్ష తీర్చుకునే ఫ్యాక్షనిస్ట్ ఢిల్లీ పర్యటనలు చేస్తే, ఇక రాష్ట్రానికి నిధులు ఏమి వస్తాయి ? సొంత కేసులు కోసం ఏపిని తాకట్టు పెట్టాడు, ప్రత్యర్ధుల పై కేసులు పెట్టండి అంటూ రాష్ట్ర హక్కుల పై రాజీ పడ్డాడు. ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండటం, ఏపి ప్రజలు చేసుకున్న కర్మ''  అని మాజీ మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు.