Asianet News TeluguAsianet News Telugu

సభలో జగన్ నోరెత్తితే జనం గోడలు దూకుతున్నారు... పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌లో : యనమల ఆగ్రహం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ పాలన అద్భుతంగా వుంటే బహిరంగ సభల్లో బారికేడ్లు దూకి ప్రజలు పారిపోవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

ex minister yanamala ramakrishnudu slams ap cm ys jagan
Author
First Published Nov 24, 2022, 2:44 PM IST

ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలు, అసత్యాలు, ఆత్మ ద్రోహాలే తప్ప అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ చేసింది శూన్యమన్నారు. అవినీతి, అక్రమ కేసులు, భూకబ్జాలను పెంచి పోషిస్తున్నారని... కానీ అప్పులపాలు చేసి, అన్ని రంగాల్లో నాశనం చేశారని యనమల దుయ్యబట్టారు. జగన్ పాలన అద్భుతంగా వుంటే బహిరంగ సభల్లో బారికేడ్లు దూకి ప్రజలు పారిపోవాల్సిన అవసరం ఏంటని, జగన్మోహన్ రెడ్డి నోరు తెరవగానే జనం గోడలెందుకు దూకుతున్నారని రామకృష్ణుడు ప్రశ్నించారు. 

సీఎం పర్యటన వుందంటే చుట్టుపక్కల బారికేడ్లు పెట్టడం, పాఠశాలలను మూసివేయడం ఏంటని ఆయన నిలదీశారు. డ్వాక్రా సంఘాలను , మహిళలను , విద్యార్ధులను బెదిరించి బహిరంగ సభలకు తెచ్చుకోవడం ఏంటని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పథకాలను రద్దు చేసి 42 నెలలుగా నిరంకుశ పాలనతో జగన్ అరాచకం సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అన్ని వర్గాల వారు మీకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా వున్నారని యనమల జోస్యం చెప్పారు. 

Also Read:ఇచ్చింది సెంటు స్థలం... నచ్చినట్లుగా ఇళ్లు కుదురుతుందా : వైసీపీపై కాల్వ శ్రీనివాసులు ఫైర్

జగన్ ప్రచార పిచ్చి తారాస్థాయికి చేరిందని.. భూ హక్కు పత్రాలపై, పాస్ పుస్తకాలపై, పొలాల్లోని సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటోలు వుండటమేంటని ఆయన ప్రశ్నించారు. ఎప్పటి నుంచో పాస్ పుస్తకాలను ఇస్తున్నామని.. కానీ సీఎం ఫోటో వేసి పాస్ పుస్తకాలు ఇవ్వడం ఏంటని యనమల నిలదీశారు. ఖాళీగా వున్న భూములను కబ్జా చేసేందుకే రీ సర్వే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యాజమాన్య హక్కులను మార్చే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని యనమల నిలదీశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios