ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల విమర్శల వర్షం కురిపించారు. జగన్... ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా... ఈ పర్యటనపై యనమల మండిపడ్డారు. జగన్.. ప్రధాని మోదీకి సమర్పించిన వినతిపత్రం ప్రజా పత్రమని.. అందులో ఏమున్నాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో ప్రధానికి అందించిన ప్రజాపత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ తొక్కిపట్టి కేవలం పత్రికా ప్రకటన విడుదల చేయడం ఏమిటని మండిపడ్డారు. ప్రధానికి నివేదించిన వాటిలో మీకు నచ్చినవి మాత్రమే ప్రజలకు చెబుతారా అని ప్రశ్నించారు.

ఒకవైపు కెసీఆర్‌తో అంటకాగుతూ, మరోవైపు విభజన చట్టంలో హామీలు నెరవేర్చమని ప్రధానిని అడిగినట్లు చెప్పడం మొక్కుబడి కోసమా అంటూ ప్రశ్నించారు.  ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారా అని అడిగారు.  నిజంగా రాష్ట్రాభివృద్ది కోరుకుంటే, ప్రజల సంక్షేమం ఆశిస్తే.. ఈ నాటకాలు ఆడటం ఎందుకని విమర్శించారు.

కేంద్రం ఇస్తేనే పోలవరంలో ఇటుక పెడతాను అన్న మాటలపై మండిపడ్డారు.  టీడీపీ ప్రభుత్వం ముందే రాష్ట్ర నిధుల నుంచి ఖర్చుచేసి తరువాత కేంద్రం నుంచి నిధులు తెచ్చి 70% పనులు పూర్తి చేసిందన్నారు. అలాంటిది ఇప్పుడు ఐదు నెలలుగా పోలవరం పనులు ఆగిపోయాయన్నారు. 

 వాహనాల కదలికలతో, కూలీల సందడితో ఒకప్పుడు కోలాహలంగా ఉన్న పోలవరం సైట్.. ఇప్పుడు ఎలాంటి సందడి లేకుండా కనిపిస్తుంటే మీకు చీమ కుట్టినట్లు కూడా లేదా అని ప్రశ్నించారు. హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రులే చెబుతుంటే దానిపై మీరు గానీ, మీ ఎంపీలు గానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.