ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను  సెర్బియా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు.  నిమ్మగడ్డ అరెస్టుపై సీఎం జగన్ స్పందించాలని ఈ సందర్భంగా యనమల డిమాండ్ చేశారు. 

సీబీఐ కేసు తేలకుండానే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఎలా రిలీజ్ చేస్తారని మాజీ మంత్రి యనమల ప్రశ్నించారు. వాన్ పిక్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, నిమ్మగడ్డతో తన వ్యాపార లావాదేవీలను జగన్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు విదేశాంగ మంత్రిని కలిసి నిమ్మగడ్డను విడిపించాలని కోరడం.. జగన్ డైరెక్షన్ లోనే జరుగుతోందన్నారు.  జగన్‌తో నిమ్మగడ్డ వ్యాపార బంధానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యమని యనమల ఆరోపించారు. 

మిమ్మల్ని ప్రజలు గెలిపించింది రాష్ట్రానికి ప్రయోజనాల కోసమా? లేక నిందితుల ప్రయోజనాల కోసం గెలిపించారా అని మరోసారి ప్రశ్నించారు. అంతర్జాతీయంగా అవినీతి కేసులలో జగన్‌ పేరు మార్మోగుతోందని యనమల చెప్పారు.

ఇదిలా ఉండగా... సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డ పై రన్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెర్బియాకు ఆయన విహారయాత్రకు వెళ్లి అక్కడ పోలీసులకు చిక్కడం విశేషం.

అయితే... నిమ్మగడ్డ ప్రసాద్ ని భారత్ కి రప్పించేందుకు వైసీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా వారు కోరుతున్నారు. సెర్బియాతో సంప్రదింపులు జరిపి.. నిమ్మగడ్డను సురక్షితంగా భారత్ కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని విదేశాంగమంత్రి జైశంకర్ కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు.

related news

పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్... కేంద్రం సహాయం కోరిన వైసీపీ