అచ్చం కేఎల్ రావు లాగా.. కేశినేని నానిని మరోసారి గెలిపించండి : ప్రజలకు వసంత నాగేశ్వరరావు పిలుపు
విజయవాడ ఎంపీగా మరోసారి కేశినేని నానిని గెలిపించాలని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు. గతంలో కేఎల్ రావు ఎలా పనిచేశారో.. ఇప్పుడు నాని కూడా అలాగే పనిచేస్తున్నారని కొనియాడారు.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా మరోసారి కేశినేని నానిని గెలిపించాలని ఆయన కోరారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో వసంత మాట్లాడుతూ.. నాని చాలా బాగా పనులు చేశారని, మరోసారి గెలిపిస్తే మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తారని ఆకాంక్షించారు. తాను చాలా మంది ఎంపీలను చూశానని.. కానీ రెండు రోజుల్లోనే బ్రిడ్జిని మంజూరు చేయించిన వ్యక్తి కేశినేని నానినే అని వసంత నాగేశ్వరరావు ప్రశంసించారు. గతంలో కేఎల్ రావు ఎలా పనిచేశారో.. ఇప్పుడు నాని కూడా అలాగే పనిచేస్తున్నారని కొనియాడారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో కేశినేని లాంటి ఎంపీని చూడలేదని నాగేశ్వరరావు ప్రశంసించారు.
అంతకుముందు తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ తాను టీడీపీ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. హ్యాట్రిక్ విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెడతానని నాని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల గురించి అధిష్టానం చూసుకుంటుందని.. రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమన్న ఆయన, పదవులు వాటంతట అవే వస్తాయని ఎంపీ పేర్కొన్నారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులపై నాని మాట్లాడుతూ.. దేశంలో నిజాయితీ వున్న అతికొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒకరని ప్రశంసించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేదని.. చంద్రబాబు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇవ్వడం చాలా సాధారణమైన విషయమన్నారు.