చంద్రబాబు అరెస్ట్ .. రాజకీయ కక్ష సాధింపే : తుమ్మల నాగేశ్వరరావు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అరెస్ట్ సమయంలో కనీస న్యాయ సూత్రాలు పాటించలేదని.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తితో చాలా అమర్యాదగా ప్రవర్తించారని తుమ్మల ఫైర్ అయ్యారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబు పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని.. అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని తుమ్మల ఆరోపించారు. అరెస్ట్ సమయంలో కనీస న్యాయ సూత్రాలు పాటించలేదని.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తితో చాలా అమర్యాదగా ప్రవర్తించారని తుమ్మల ఫైర్ అయ్యారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించారు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళంతో లోకేష్, ప్రజాబలంతో చంద్రబాబు తన ప్రభుత్వ పునాదులు కదుపుతున్నారన్న భయంతో జగన్ బరితెగించాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై జగన్ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన సీబీసీఐడీ, సీఐడీ ఇతర సంస్థలు జగన్ కక్ష సాధింపు వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అర్ధరాత్రి వెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అసవరం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విషయంలో దర్యాప్తు సంస్థలు పరిధి దాటి వ్యవహరించాయన్నారు.
విపక్షాలను తప్పుడు కేసులతో దారికి తెచ్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని కన్నా ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి లభించిందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ ప్రభుత్వం నివేదిక రూపంలో తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా సైకో ముఖ్యమంత్రికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని కన్నా జోస్యం చెప్పారు. పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ జైలుకెళ్లడం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు.