కార్పోరేషన్‌లో అక్రమాలు జరిగితే మాజీ సీఎంపై కేసులా .. జగన్ బూట్ల కింద సీఐడీ నలుగుతోంది : సోమిరెడ్డి
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి . జగన్ బూట్ల కింద సీఐడీ నలిగిపోతోందని.. వైసీపీ నేతల పాపాలు పండాయని.. అన్నీ అనుభవిస్తారని సోమిరెడ్డి హెచ్చరించారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్పోరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ సీఎంపై కేసు పెడతారా అని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులను ప్రశ్నించరా అని సోమిరెడ్డి నిలదీశారు. జగన్ బూట్ల కింద సీఐడీ నలిగిపోతోందని.. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వున్నాయి, చూసుకోవాలని ఆయన దుయ్యబట్టారు. సర్వీస్ ట్యాక్స్ సమస్య వచ్చిందని డిజైన్ టెక్ ఎండీ చెప్పారని చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు. మంత్రులు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల పాపాలు పండాయని.. అన్నీ అనుభవిస్తారని సోమిరెడ్డి హెచ్చరించారు.
అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వాళ్లు అనుకున్నది చేసుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని దృష్టి మళ్లించేందుకు, కక్షపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. నాలుగేళ్లలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఇన్ని డబ్బులు పోయాయని, చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని ఎక్కడ నిరూపించలేదని అన్నారు.
ALso Read: ఏకంగా విమానంలో ప్లకార్డులతో, రన్ వే పై పడుకుని... చంద్రబాబు అరెస్ట్ పై వినూత్న నిరసన
చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని.. అందుకే కక్షపూరితంగా చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని కక్షపూరితంగా చేశారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు కూడా చంద్రబాబు తప్పు చేశాడని నమ్మడం లేదని పయ్యావుల కేశవ్ అన్నారు. ‘‘మావాడు జైలులో పెట్టాలని అనుకున్నాడు.. చేశాడు.. అవినీతి జరిగిందా? లేదా? అనేదానితో సంబంధం లేదు’’ అని వైసీపీ నేతలు కూడా ప్రైవేట్‌గా మాట్లాడుకుంటున్నారని పయ్యావుల అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఈడీ, జీఎస్టీలు విచారణ జరిపాయని.. ఎక్కడ కూడా డబ్బులు పోయాయని ఎవరూ చెప్పలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. సామాన్లు అన్ని అందినట్టుగా చెప్పారని తెలిపారు. అద్భుతంగా పనిచేసిందని సీమెన్స్‌కు సర్టిఫికేట్ కూడా ఇచ్చారని చెప్పారు. ఒక్క రూపాయి అన్న పక్కకు దారి మళ్లినట్టుగా సీఐడీ అధికారులు నిరూపించారా? అని ప్రశ్నించారు.
ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదని తాము చెబుతున్నామని అన్నారు. అలాంటప్పుడు చంద్రబాబుకు డబ్బు వచ్చే అవకాశం ఎక్కడుందని చెప్పారు. సీఐడీ విచారణ కన్నా సజ్జల ఇన్వేస్టిగేషన్ ఎక్కువైందని.. ఆయన చెప్పినదానికి పదింతలు చేసిన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చర్యలకు తెలుగుదేశం పార్టీ భయపడదని చెప్పారు.