ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, వైసీపీలో చేరనున్నారు. బుధవారం సాయంత్రం కుమారుడితో కలిసి శిద్ధా రాఘవరావు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

వ్యాపారవేత్తగా ప్రకాశం జిల్లాలో మంచి పేరున్న శిద్ధా 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి వివిధ హోదాల్లో  పనిచేశారు. 2007లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

2014లో తొలిసారిగా దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగానూ అవకాశం సంపాదించారు. 2019లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన శిద్ధా రాఘవరావు ఓటమి పాలయ్యారు. ఆయన కుమారుడు సుధీర్ కుమార్ కూడా కనిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.