విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను తక్షణమే రద్దు చెయ్యాలని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో మాట్లాడిన శైలజానాథ్  రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయని ఆరోపించారు. 

ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ఒక నియమ నిబద్దత లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని ప్రగల్భాలు పలికిన ఎన్నికల కమిషన్ ఎందుకు ధన ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కోట్లు ఖర్చుపెట్టినట్లు అభ్యర్థులు బాహటంగా చెప్తున్నారని దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికల కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఓటు వేయడానికి వెళ్తే ఈవీఎంలు పనిచెయ్యలేదన్నారు. 

ఏడుశాతం ఈవీఎంలు రాష్ట్రంలో పనిచెయ్యలేదని ఆరోపించారు. అందుకే ఎన్నికలను రద్దు చెయ్యాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో డబ్బులు పంచారా లేదా అనేదానిపై జ్యుడీషియరీ ఎంక్వైరీ వెయ్యాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.