ఇదేంటి రోజా..! అప్పుడలా, ఇప్పుడిలా.. రుషికొండ భవనాలపై ఎందుకిలా..?
విశాఖ రుషికొండ భవనాలు సీఎం జగన్ నివాసానికి అనువుగా ఉన్నాయని గతంలో మంత్రి హోదాలో ఆర్కే రోజా తెలిపారు. ఇప్పుడేమో అవి టూరిజం భవనాలని తాపీగా సెలవిస్తున్నారు. జగన్ సొంత భవనాలన్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని అక్కసు వెళ్లగక్కుతున్నారు.
విశాఖలోని రుషికొండపై సుమారు రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనాలను నిర్మించింది గత ప్రభుత్వం. వాటిని అత్యంత రహస్యంగా ఉంచింది. కనీసం మీడియాని కూడా ఆ భవనాల ప్రారంభోత్సవానికి అనుమతించలేదు. దాంతో ఎందుకంత సీక్రెట్‌గా రుషికొండ భవనాలను ఉంచుతున్నారన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ప్రభుత్వం మారడంతో రుషికొండ భవనాల భండారం బయటపడింది. లక్షా 41వేలకు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు, వాటిలో లక్షల ఖరీదైన ఫర్నీచర్, ఇంటీరియర్ డెకరేషన్ వస్తువుల ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. రాజ భవనాలను తలపించే ఈ నిర్మాణాలను చూసిన వారు ఒకింత విస్తుపోయారు. టూరిజం భవనాలే అయితే మరీ ఇంత లగ్జరీగా, రహస్యంగా నిర్మిస్తారా అని చూసినవారు ముక్కున వేలేసుకున్నారు. జగన్ విశాఖకు వెళ్తానని గతంలో పదేపదే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కోసమే ఆ భవనాలు అత్యంత రహస్యంగా నిర్మించారని తెలుస్తోంది.
అయితే, ఈ వివాదంపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రుషికొండ భవనాలపై స్పందించారు. రుషికొండ భవనాలు వైఎస్ జగన్ తనకోసం కట్టుకున్నవి కావన్నారు. ముందు నుంచి అవి టూరిజం భవనాలేనని చెబుతూ వచ్చామన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం కోసమని తామెన్నడూ చెప్పలేదన్నారు. విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ లాంటి ప్రముఖులు వచ్చినపుడు బస చేసేలా అన్ని సౌకర్యాలతో అందంగా రుషికొండపై భవనాలను నిర్మించినట్లు చెప్పుకొచ్చారు.
తాజాగా మరో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా రుషికొండ భవనాల వివాదంపై స్పందించారు.
‘‘రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా..?
విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..?
వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా..?
2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?
61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం... ఇందులో అక్రమం ఎక్కడుంది..?
విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?
ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా...?
హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?
ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?
హైదరాబాద్‌లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్‌లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా... ఈరోజు విమర్శలు చేసేది..?
లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?
మా @ysjagan అన్న పైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో @YSRCParty వెన్ను చూపేది లేదు... వెనకడుగు వేసేది లేదు..!!’’ అంటూ రోజా ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
అయితే, విశాఖ రుషికొండ ప్యాలెస్ నుంచి జగన్ పరిపాలన చేస్తారని గతంలో మంత్రి హోదాలో రుషికొండ భవనాలను ప్రారంభించిన రోజా తెలిపారు. సీఎస్ నేతృత్వంలోని త్రీ మెన్ కమిటీ పరిశీలించి.. రుషికొండ భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనువుగా ఉంటుందని తేల్చిందని చెప్పారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలు రుషికొండ భవనాలను ఎందుకంత రహస్యంగా ఉంచారో చెప్పకనే చెప్పాయి.
మరోవైపు తెలుగుదేశం పార్టీ రుషికొండ భవనాల వివాదాన్ని ఇప్పట్లో వదిలేలా లేదు. దానికి సంబంధించి వైసీపీ చేసిన ప్రతి పనినీ బయటకు లాగుతోంది.
‘‘మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అనేది సామెత. కానీ జగన్ ప్రజల సొమ్మును తాను తిన్నది కాక బంధువర్గాన్ని కూడా బాగా మేపాడు. రుషికొండ ప్యాలెస్ ఇంటీరియర్ సోకులకు ఏకంగా రూ.120 కోట్ల కాంట్రాక్టును సమీప బంధువు సుప్రియా రెడ్డికి ఇచ్చాడంటే... జగన్ ఏపీ ఖజనాని తన సొంత జేబులా వాడేసాడన్నమాట..’’ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అనేది సామెత. కానీ జగన్ ప్రజల సొమ్మును తాను తిన్నది కాక బంధువర్గాన్ని కూడా బాగా...
Posted by Telugu Desam Party (TDP) on Tuesday, June 18, 2024
ప్రభుత్వం మారాక రుషికొండ భవనాల లోపలికి వెళ్లి.. రహస్యాలన్నీ బయట పెట్టిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇలా స్పందించారు.
‘‘రాజకోట రహస్యం ఎన్నికలకు ముందే వెల్లడై ఉంటే మీకు 11 సీట్లు కూడా వచ్చేవి కావు. రుషికొండ భవన నిర్మాణంపై ఎందుకీ కుప్పిగంతులు, దాగుడుమూతలు? మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారు. తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు. ఆ పైన సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. ప్రభుత్వ నిర్మాణమైనా, ప్రైవేట్ నిర్మాణమైనా ప్లాన్ వివరాలను ఆ కట్టడం దగ్గర ప్రదర్శిస్తారు. సెక్యూరిటీ కారణాల వల్ల అలా చేయలేదని మీరు సమర్ధించుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ బస చేయడానికి ఐఎన్ఎస్ డేగ, నేవల్ గెస్ట్ హౌస్ వంటి నిర్దిష్ట విడిది ప్రాంతాలు ఉన్నాయి. వి.వి.ఐ.పి.లు ఉండే భవనాలు కావడం వల్ల రుషికొండ మీద ఏం కడుతున్నామో చెప్పలేకపోయామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనడం హాస్యాస్పదం. సరైన అనుమతులు లేవని ప్రభుత్వమే నిర్మించిన ప్రజా వేదికను నిర్దాక్షణ్యంగా కూల్చివేశారు మీరు. మరి గ్రీన్ ట్రిబ్యునల్ మొదలు అనేక అభ్యంతరాలున్న రుషికొండ భవనాన్ని ఏం చెయ్యాలి? రుషికొండ రాజకోట రహస్యం ఎన్నికలకు ముందే బహిర్గతమై ఉంటే మీ పార్టీకి ఈ 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదు.’’ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.