కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్, ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డికి కూడా హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని సర్వేలు ఆ పార్టీకి మెజారిటీ సీట్లు రావడం ఖాయమని చెప్పిన నేపథ్యంలో .. నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బీజేపీలో టికెట్లు దక్కని కీలక నేతలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో ఆ పార్టీ మరింత బలంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా కర్ణాటక ఎన్నికల్లో తెలుగు నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో కొందరికి అక్కడి ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్లుగా తెలుస్తోంది. ప్రచారం, ఎన్నికల పరిశీలన, ఇతరత్రా బాధ్యతలు వీరికి కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్, ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డికి కూడా హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా రఘువీరారెడ్డిని నియమించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పలు హోదాల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీసీసీ చీఫ్‌గా పనిచేసినప్పటికీ.. ఆ తర్వాత రఘువీరా రెడ్డి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. తన స్వగ్రామం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా అధిష్టానం నిర్ణయంతో రఘువీరా రెడ్డి మరోసారి రాజకీయంగా యాక్టీవ్ అవుతున్నారని ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
