తెలుగుదేశం పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్ని నాని. యువగళం పేరుతో నారా లోకేష్ సాయంత్రం ఆరు నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు తిరుగుతున్నాడని.. దీనిని పాదయాత్ర అంటారా అని పేర్ని నాని సెటైర్లు వేశారు.
తెలుగుదేశం పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్ని నాని. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 2019లో గన్నవరం టికెట్ ఇచ్చినప్పుడు వల్లభనేని వంశీ పశువుల డాక్టర్ కాదా అని ప్రశ్నించారు. 2004, 2009లో తెలుగుదేశం నుంచి గెలిచినప్పుడు కొడాలి నాని ఏమైనా ఇంజనీరా, సైంటిస్టా అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు.
కప్పులు కడిగేవాడంటే ఇప్పటికీ చంద్రబాబు ప్యాంటు ఎందుకు తడుస్తోందని దుయ్యబట్టారు. మోడీ కప్పులు కడగలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఓట్ల కోసం లారీ డ్రైవర్ల భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్నారని.. ఇది పెత్తందారి స్వభావం కాదా అని ఆయన నిలదీశారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్ధి లేరని.. లోకేష్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు. లోకేశ్ అసమర్ధత కారణంగా చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను తెచ్చుకోవాల్సి వచ్చిందని చురకలంటించారు.
Also Read: గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఏపీ ఆదర్శం: నంద్యాలలో సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లకు జగన్ శంకుస్థాపన
యువగళం పేరుతో నారా లోకేష్ సాయంత్రం ఆరు నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు తిరుగుతున్నాడని.. దీనిని పాదయాత్ర అంటారా అని పేర్ని నాని సెటైర్లు వేశారు. పగటిపూట ప్రజలు నిలదీస్తారే ఉద్దేశంతో రాత్రుళ్లు తిరుగుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. కాకపోతే యువగళానికి వచ్చినందుకు పేదలకు వెయ్యే, రెండు వేలో ఇస్తున్నారని.. తద్వారా పేదలకు మంచి జరుగుతోందన్నారు. పాదయాత్ర ఎలా చేయాలో వైఎస్ పాదయాత్ర వీడియోలు చూస్తే తెలుస్తుందని.. జగన్ ఇష్తున్న పథకాలకు పేరు మార్చి ఇస్తామంటున్నారని పేర్ని నాని మండిపడ్డారు. లోకేష్ తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నారని.. అలాంటి వారికి అధికారం ఇవ్వాలా అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
