గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఏపీ ఆదర్శం: నంద్యాలలో సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లకు జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు.
అమరావతి:గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికే ఏపీ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.నంద్యాల జిల్లాలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారంనాడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టుగా సీఎం జగన్ చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్ల వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కూడ దక్కుతాయన్నారు. అంతేకాదు ఈ పవర్ ప్లాంట్లు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవన్నారు సీఎం జగన్.
రైతులకు సరఫరా చేసే ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని సీఎం జగన్ చెప్పారు.ఈ క్రమంలోనే సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టుగా సీఎం జగన్ వివరించారు. సోలార్ పవర్ కోసం యూనిట్ విద్యుత్ ను రూ. 2.49 లకు ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు సీఎం జగన్.
రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. సోలార్ పవర్ కోసం ఎన్‌హెచ్‌పీసీ తో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు సీఎం. అంతేకాదు రైతులకు ప్రతి ఎకరానికి ఏటా రూ. 31 వేలను లీజు రూపంలో చెల్లించనున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే కొన్ని డీపీఆర్ లు సిద్దమయ్యాయన్నారు సీఎం. ఈ విషయమై పలు కంపెనీలతో అలాట్ మెంట్ ఒప్పందం చేసుకుంటున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు.
నంద్యాల జిల్లాలోని అవుకు మండలం జానూతల గ్రామంలో 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు పాణ్యం మండలంలోని కందికాయపల్లె గ్రామంలో పవన్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఏడాది మార్చిలో విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కార్బన ఉద్గారాలను తగ్గించేందుకు గాను సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఎన్‌హెచ్‌పీసీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.