జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతల మీద, తెలంగాణ ప్రభుత్వం మీద పవన్ ఈగ వాలనివ్వడం లేదని విమర్శించారు.

తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతల మీద, తెలంగాణ ప్రభుత్వం మీద పవన్ ఈగ వాలనివ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రులను విమర్శిస్తున్నారనేదే పవన్ కల్యాణ్ బాధ అని అన్నారు. తెలంగాణ ప్రజలకి వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాన్ చేసిన కామెంట్స్‌పై మంత్రి పేర్ని నాని స్పందించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏమన్నారో పవన్ కల్యాణ్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. హరీష్ రావు ఏం మాట్లాడరో మాత్రం పవన్ చెప్పరని విమర్శించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందన గానే ఏపీ మంత్రులు మాట్లాడారని అన్నారు. 

తెలంగాణతో పవన్ కల్యాణ్ ఈ కొత్త బంధం ఏమిటని ప్రశ్నించారు. అసత్యాలను తమపై రుద్ది పవన్ కల్యాణ్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కన్నతల్లి లాంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విమర్శిస్తే ఖండించాలా? వద్దా? అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి ఏపీని కించపరిచే విధంగా మాట్లాడితే.. దానికి ప్రతిస్పందనగా ఇక్కడి మంత్రులు మాట్లాడారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సొంత గడ్డ అనే భావన పవన్ కల్యాణ్‌కు లేదా? అని ప్రశ్నించారు.

Also Read: తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్న మంత్రులకు, వైసీపీ నాయకులను పవన్ కల్యాణ్ బెదిరించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కిరాయి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక, ఈ సందర్భంగా గతంలో తెలంగాణ నేతల గురించి పవన్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.