జనసేన పార్టీకి జనంలో ఆదరణ పెరుగుతోందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసైనికులను ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
జనసేన పార్టీకి జనంలో ఆదరణ పెరుగుతోందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసైనికులను ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహన్, పీఏసీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో జరిగిన ఘటనను రాష్ట్రం మొత్తం చూసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దాష్టికాలను జనసేన నాయకులు ఎదుర్కొన్న తీరు అభినందనీయమని అన్నారు. పవన్ కల్యాన్ వారికి అండగా నిలబడి భరోసా ఇచ్చారని చెప్పారు. భవిష్యత్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అవినీతిపై పోరాటం సాగించాలని కోరారు. ఈ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్.. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
Also Read: నమస్కారానికి.. ప్రతి నమస్కారం లేదు, ఏం మాట్లాడతారోనని భయమేస్తోంది.. ఏపీలో పరిస్థితి ఇది : పవన్
ఇక, ఇటీవల విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే విజయవాడలో పవన్ కల్యాణ్‌ను కలిసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలను కూడా జనసేన పీఏసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అలాగే రాష్ట్రంలో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు సాగే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పీఏసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
