జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. సొంత అన్నకు వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌దంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  

పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పవన్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కి పొంతనే లేదని పేర్ని నాని దుయ్యబట్టారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి పోరాటం చేశారని.. 18 సీట్లు గెలిచారని ఆయన గుర్తుచేశారు. గతంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ ఏం చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. సొంత అన్నకు వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌దంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్లీ కనిపించలేదని .. వారంతాపు ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ భ్రమల్లో వున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ మాట్లాడుతున్నారని.. తాను మాత్రం చాలా పునీతుడిని అన్నట్లు పవన్ మాటలు వున్నాయని మాజీ మంత్రి దుయ్యబట్టారు. ప్రజారాజ్యం పార్టీని పవన్ కల్యాణ్ ఎందుకు వదిలేశారని పేర్ని నాని ప్రశ్నించారు. 

Also REad:వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులకే టికెట్లు: పవన్ కళ్యాణ్

చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్, ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. రాజకీయాల్లో పవన్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదని మాజీ మంత్రి చురకలు వేశారు. 2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్.. 2014లో అదే వ్యక్తికి ఓటేయమని ప్రజల్ని కోరాడని పేర్ని నాని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను విడిచి కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. జగన్ మీద ఏడవటం తప్పించి చంద్రబాబు గురించి ఒక్కరోజైనా పవన్ మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి పవన్ కల్యాణ్‌ది రాజకీయ పార్టీ ఎలా అవుతుందని పేర్ని నాని నిలదీశారు.