ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వస్తున్న కథనాలను కొట్టిపారేశారు మాజీ మంత్రి పేర్ని నాని. సీఎం జగన్‌కు అలాంటి ఆలోచన లేదని.. ఇప్పుడున్న కేబినెట్‌తోనే తాము ఎన్నికలకు వెళ్తామని నాని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ వుంటుందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రేపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీదే జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారని నాని అన్నారు. ఎన్నికలకు ముందుకు మంత్రివర్గాన్ని మార్చడానికి జగన్ చంద్రబాబు లాంటి వ్యక్తి కాదన్నారు. ఇప్పుడున్న కేబినెట్‌తోనే తాము ఎన్నికలకు వెళ్తామని, ఎన్నికల్లో గెలుస్తామని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎన్నికల్లో అభ్యర్ధులు దొరకడం లేదన్నారు. 

కాగా.. ఇప్పుడున్న మంత్రివర్గం.. తన తొలి కేబినెట్ కంటే వీక్‌గా వుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికి వచ్చినట్లుగా కథనాలు వస్తున్నాయి. విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా బదులిచ్చే వారు కరువయ్యారని సీఎం పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు కూడా. అందుకే కొత్తగా ఎమ్మెల్సీలుగా గెలిచిన వారిలో సామాజిక సమీకరణలు పక్కనపెట్టి.. సమర్ధులైన వారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. 

ఇదిలావుండగా.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం సీఎం జగన్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గత కొంతకాలంగా తనను కేబినెట్‌లోకీ తీసుకోవాల్సిందిగా జగన్‌ను తమ్మినేని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని స్పీకర్ కలవడంతో వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. తమ్మినేని సీతారాంను కేబినెట్‌లోకి తీసుకుంటారా అంటూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంపైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ALso REad: ఏపీ కేబినెట్ విస్తరణ : మంత్రివర్గంలోకి తమ్మినేని సీతారాం, స్పీకర్‌గా ధర్మాన ప్రసాదరావు, వైసీపీలో ఊహాగానాలు

తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి స్పీకర్‌గా ఎవరిని నియమిస్తారన్న దానికి సమాధానంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది. సౌమ్యుడిగా పేరొందిన ధర్మాన ప్రసాదరావు ఇటీవలికాలంలో వరుసపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల ఉద్యమాన్ని ఆయన తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో నోటీకి పనిచెబుతున్నారు. దీంతో ధర్మాన తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందని వైసీపీ శ్రేణులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయనను స్పీకర్ పదవిలో కూర్చొబెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లుగా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల మధ్య మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత కలిగించింది. కేబినెట్‌లో మార్పు చేర్పులపై క్లారిటీ ఇవ్వడానికే సీఎంవో నుంచి అప్పలరాజుకు పిలుపొచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తాను మంత్రిగా వున్నా.. లేకున్నా, మంత్రినే.. నేనే కాదు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ కాసేపటికీ స్పీకర్ తమ్మినేని కూడా వెళ్లడంతో వైసీపీలో ఏదో జరుగుతోందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. 

కాగా.. గతేడాది వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే . 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ అసంతృప్త నేతలు అధికార పార్టీని చికాకు పెడుతూనే వున్నారు.