గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సిట్ ఏర్పాటు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ టీడీపీ పాలనపై ఎన్నో విచారణలు జరిపారని చివరికి ఏం సాధించారని లోకేశ్ ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా సబ్ కమిటీలు, సీఐడీ విచారణలు, విజిలెన్స్ దాడులు నిర్వహించి ఏం సాధించారని ఆయన నిలదీశారు. ఈ సిట్ కూడా అంతే అని లోకేశ్ అభిప్రాయపడ్డారు. 

'''మహామేత'' అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించారు. ఏమైంది? అని ప్రశ్నించారు

గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటికి, ఈడీ కి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది? అని మరో ట్వీట్ లో ప్రశ్నించారు.

"ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు..అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతోనే ఇక్కడే అర్ధం అవుతుంది యువమేత ఆత్రం.. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమే అంటూ ట్వీట్ చేశారు.

టీడీపీ పాలనలో జరిగిన ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు, టెండర్లలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి సిట్‌కు నేతృత్వం వహించనున్నారు