ఆంధ్రుల మనోభావాలంటే ముఖ్యమంత్రి జగన్ గారికి ఎంత లెక్కలేనితనమో అర్థమౌతోందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా.. మరోసారి లోకేష్... సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై  మండిపడ్డారు. ప్రజల మనో భావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.

ఆంధ్రుల మనోభావాలంటే జగన్‌ గారికి ఎంత లెక్కలేనితనమో! రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లెటర్లు రాసింది. బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ సొంత ఇళ్ళను వందల కోట్లతో కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు?’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.