మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పట్టిన గతే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కి పడుతుందని బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగు జాడల్లోనే  సీఎం జగన్ నడుస్తున్నారని ఆయన విమర్శించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు పట్టిన గతే జగన్‌కూ పడుతుందన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయని, రాష్ట్ర అభివృద్ధి రివర్స్‌లో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేశారని, అక్రమ నిర్బంధాల వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.

కాగా... చంద్రబాబుకి పట్టిన గతే జగన్ కి కూడా పడుతుందంటూ మాణిక్యాలరావు గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. జన్మభూమి కమిటీల వలనే టీడీపీ ఓడిపోయిందని, ఇప్పుడు జగన్‌ వలంటీర్ల పేరుతో అదే వ్యవస్థను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ గ్రామ వాలంటీర్ల విధానమే భవిష్యత్తులో జగన్ ఓటమికి కారణం అవుతుందని హెచ్చరించారు.  కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, దేశం అంతా తిరిగినా ఆయన మాటలు ఎవరూ నమ్మలేదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే చంద్రన్న బీమా పథకం అమలుచేశారని చెప్పారు. చంద్రబాబు విధానాలనే సీఎం జగన్‌ కూడా అనుసరిస్తున్నారన్నారు.