అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు. అసలు అన్యాయం చేసింది కేంద్రం కాదని చంద్రబాబేనని ఆరోపించారు. 

ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఆ ప్రత్యేక ప్యాకేజీని కూడా అమలు చెయ్యడం చంద్రబాబు ప్రభుత్వానికి చేతకాలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తు జరిపితే తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 

ఆఖరికి రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ, ఏసీబీ దాడులు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందో చెప్పాలన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పుకొచ్చారు. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గల నియోజకవర్గాలకు నిధులు విడుదల చెయ్యకుండా వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని మాణిక్యాలరావు తెలిపారు. 

చందబ్రాబు కారణంగా ఏపీకి ఇంత అన్యాయం జరగుతున్నందుకు తాము చింతిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబులా తమకు కూడా రోషం ఉందని, కానీ అది రాజకీయ రోషం మాత్రం కాదని నిజమైన రోషమని మాణిక్యాలరావు స్పష్టం చేశారు.