ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటూ ట్విట్టర్ లో సూచనలు చేశారు. బాక్సైట్ తవ్వకాల గురించి లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని 2004లోనే చంద్రబాబు తేల్చి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

‘మీ తండ్రి ఆ నిర్ణయానికి తూట్లు పొడిచి రస్‌ ఆల్ ఖైమా సంస్థను బాక్సైట్ తవ్వకాలకోసం తీసుకొచ్చారు. మళ్లీ 2014లో బాక్సైట్ తవ్వకాలకు మీ తండ్రి ఇచ్చిన అనుమతులన్నీ చంద్రబాబు రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ మీరు బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తున్నామని నాటకం ఆడటం దానికి సాక్షి రాతలు చూస్తుంటే, సిగ్గు కూడా సిగ్గు పడుతుంది జగన్ గారూ!. అదేదో సినిమాలో జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ అని కామెడీ చేసినట్లు ఎత్తేసిన కేసులనే మళ్ళీ ఎత్తేయడం.. ఇదివరకే రద్దు చేసిన వాటిని... మళ్లీ రద్దు చేయడం లాంటివి కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించండి.. లేకపోతే ప్రజల్లో కామెడీ పీస్ లాగా మిగిలిపోతారు’ అని జగన్‌పై లోకేష్ సెటైర్లు వేశారు.