ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నే లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. గత నెలలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ... చేతగాని  ప్రభుత్వం అంటూ కామెంట్స్ చేశారు. గోదావరి బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలను మాజీ ఎంపీ హర్ష కుమార్ బయటపెట్టారని లోకేష్ పేర్కొన్నారు.

నిజాలు బయటపెట్టినందుకు దళితుడైన మాజీ ఎంపీ హర్షకుమార్ ని కేసులతో వేధిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. గోదావరిలో 144 సెక్షన్‌ పెట్టిన మేధావి జగన్‌ బోటును తీయలేడా? ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది?.. అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. 

బోటు ప్రమాదం వెనక ఉన్న రహస్యాన్ని జలసమాధి చేయాలని చూసినంత మాత్రాన నిజాలు దాగవన్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్‌ చేసి, ఆపేసిన బోటును వదిలిపెట్టాలంటూ ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని లోకేశ్‌ నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

కాగా... దేవీపట్నం-కచ్చలూరు మధ్య  ఈ నెల 15వ తేదీన బోటు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 93 మంది ఉన్నారని ఆయన చెప్పారు. దేవీపట్నం ఎస్ఐ వద్దని వారించినా కూడ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందని హర్షకుమార్ ఆరోపించారు. 

ఈ ప్రాంతంలో బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన బోటులో కూడ ఇలానే జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదం విషయంలో  అధికారులు సీఎం జగన్ కు తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా గతంలో హర్ష కుమార్ ఆరోపించారు.