Asianet News TeluguAsianet News Telugu

విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందా.. జగన్ లాక్కున్నారా, ఈడీ రంగంలోకి దిగాల్సిందే : టీడీపీ నేత జవహర్

వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్. పోయిన ఫోన్ లో శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిల లావాదేవీలు,  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లావాదేవీలు, ఇతర నిగూఢ అంశాలు దాగున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. 

ex minister ks jawahar satires on ysrcp mp vijayasai reddy over i phone missing issue
Author
First Published Nov 23, 2022, 5:03 PM IST

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అందరి వాటాల వివరాలు ఆ ఫోన్‌లోనే వుందని ఆరోపించారు. ఈడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందనే డ్రామాలు ఆడుతున్నారని జవహర్ ఎద్దేవా చేశారు. దీనిలో భాగంగానే ఫోన్ దాచేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు విశాఖ రుషికొండ వాటాల సమాచారం కూడా విజయసాయిరెడ్డి ఫోన్‌లోనే వుందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత ఫోన్ పోయిందని విజయసాయి చెబుతున్నారని.. నిజంగానే పోయిందా , లేక జగన్మోహన్ రెడ్డి లాక్కున్నారా అని జవహర్ సెటైర్లు వేశారు. 

పోయిన ఫోన్ లో శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిల లావాదేవీలు,  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లావాదేవీలు, ఇతర నిగూఢ అంశాలు దాగున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. సముద్రపు లోతులో దాగి ఉండే రహస్యాలను మించిన రహస్యాలు ఏ2 ఫోన్ లో ఉండి ఉండొచ్చునని జవహర్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికత ఉందని చెప్పుకునే ఐఫోన్ పోవడం అంత ఆషామాషీకాదన్నారు. నిజంగానే ఐఫోన్ పోతే అదిఎక్కడుందో తెలుసుకోవచ్చునని జవహర్ పేర్కొన్నారు. గతంలో కూడా అక్రమాస్తుల విచారణకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసుల విచారణను ఎదుర్కొనే సమయంలో విజయసాయిరెడ్డి ల్యాప్‌ట్యాప్ వాడటంరాదని చెప్పి తప్పించుకోవాలని చూశారని మాజీ మంత్రి గుర్తుచేశారు.

ALso REad:సొంత పార్టీ నేతలను, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి.. వైసీపీలో అలజడి..!

ఫోన్ వ్యవహారం తేలాలంటే విజయసాయిని ఈడీ అధికారులు వారిదైన స్టైల్లో విచారించాలని జవహర్ డిమాండ్ చేశారు. తన అల్లుడుని ఈడీ విచారిస్తున్నప్పుడే విజయసాయి ఫోన్ పోవడం ముమ్మాటికీ తాడేపల్లి ప్యాలెస్ రహస్యమేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మొన్నటివరకు విశాఖపట్నంలో ఉన్న ఏ2 తాడేపల్లికి వచ్చి, మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడని జవహర్ ప్రశ్నించారు. తనకు ఏమీ తెలియవు... ఏదీరాదని చెప్పే విజయసాయిరెడ్డి ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి అన్ని సోషల్ మీడియావిభాగాల్లో యాక్టివ్‌గా ఎలా ఉంటున్నాడో కూడా ఈడీ తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నం అనే పరగణాకు రాజులా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి, తన ఫోన్ ని అంతతేలిగ్గా పోగొట్టుకుంటాడా.. ఆయన చెప్పేది నమ్మదగ్గ అంశమేనా” అని జవహర్ ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios