మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Kakani Govardhan Reddy : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కాకాని గోవర్థన్ రెడ్డికి బెయిల్ లభించింది. ఇప్పటికే పలు కేసుల్లో ఆయనకు బెయిల్ రాగా తాజాగా రుస్తుం మైనింగ్ కేసులో బెయిల్ వచ్చింది. పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్ లో అక్రమాలకు పాల్పడినట్లు మాజీ మంత్రిపై కేసు నమోదయ్యింది... ఇందులో ఆయన A4 గా ఉన్నారు. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు కాకానికి బెయిల్ మంజూరు చేసింది.
అధికారంలో ఉండగా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి… దీంతో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ పోలీసులు ఆయనకోపం తీవ్రంగా గాలించి కేరళలో అరెస్ట్ చేశారు. దీంతో గత రెండుమూడు నెలలుగా కాకాని జైల్లోనే ఉన్నారు. మొత్తం ఎనిమిది కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన మంగళవారం (ఆగస్ట్ 19న) జైలు నుండి విడుదలయ్యే అవకాశాలున్నాయి.
కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న కేసులేంటి?
కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండు అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులు ఉన్నాయి. జనవరిలో టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో నెల్లూరులో కేసు నమోదు అయింది. ఆయన క్వార్ట్జ్ మైనింగ్‌ను అక్రమంగా కొనసాగించినట్లు ఆరోపించారు. మైనింగ్ ప్రాంతాల్లోని గిరిజనుల ఆస్తుల నాశనం చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.
గనుల లీజు పూర్తయిన తర్వాత కూడా ఇష్టానుసారంగా మైనింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గనులను పేల్చేందుకు భారీగా పేలుడు పదార్థాలను నిల్వ చేశారనే ఆరోపణలతో ఫిబ్రవరిలో 16న కేసు నమోదైంది. ఏ4గా ఉన్న కాకాణి వరుసగా నోటీసులు ఇచ్చిన విచారణకు వెళ్లకుండా తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలోనే కేరళలో పోలీసులకు దొరికారు.


