విశాఖపట్నం నగరం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని... నగర ప్రశాంతకు ఎలాంటి భంగం కలగకూడదని.. అలాగని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతించకుండా ఉండలేమని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం అప్నన్నను గంటా శ్రీనివాసరావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఆర్ధిక రాజధానిగా ఎదిగిన విశాఖ.. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎదిగిందని, త్వరలోనే హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వనుందని అన్నారు. 

ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే మరిన్నీ వనరులు వస్తాయని.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను స్వాగతిస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నాయకులం ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధినేతకు పంపించామన్నారు. హైకమాండ్ అర్ధం చేసుకుని..తమకు మినహాయింపు ఇచ్చిందన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గంటా శ్రీనివాసరావు అన్నారు.