భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్‌మార్చ్‌ విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి కార్మికులతో పాటు పెద్దఎత్తున పవన్ అభిమానులు హాజరయ్యారు. ఒకదశలో జనసైనికులను నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు.. ఇదే సమయంలో బహిరంగసభ వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. 

అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పవన్ కల్యాణ్ రెచ్చిపోయి ప్రసంగించారు. ఇకపోతే ఈ లాంగ్‌మార్చ్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మద్ధతు ప్రకటించారు. అంతేకాకుండా మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడులను పవన్‌ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు.

Also read:వైసీపీలోకి మాజీ మంత్రి గంటా..?

అధినేత ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు లాంగ్‌మార్చ్‌లో పవన్ కల్యాణ్ వెంట నడవగా.. అయ్యన్నపాత్రుడు బహిరంగసభ వేదిక వద్దకు వచ్చారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు కారణమైంది. గత కొన్ని రోజులుగా బాబుతో పాటు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా వైఖరితో ఆయన పార్టీ మారుతారేమోనన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు గంటా తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేత రఘురాం బాంబు పేల్చారు. 

ఇక గంటా పార్టీ మార్పుపై గతంలోనే కథనాలు వచ్చాయి. వైసీపీలోకి వెళితే.. రాజీనామా చేయాలి.. చేసినా అక్కడ ప్రాధాన్యత దక్కుతుందో లేదోనన్న అనుమానం. దీంతో గంటా బీజేపీ నేత రాంమాధవ్‌తో మంతనాలు జరిపారని విశాఖ టాక్.

అయితే విశాఖ భూముల వ్యవహారంలో జగన్‌ సర్కార్ విచారణ ముమ్మరం చేయడంతో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని శ్రీనివాసరావు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ లేదంటే వైసీపీ పంచన చేరితే గండం గట్టెక్కవచ్చన్నది గంటా ఆలోచనగా తెలుస్తోంది. అయితే పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై గంటా శ్రీనివాసరావు కొద్దిరోజుల క్రితం స్పందించారు. 

Also Read:వల్లభనేని వంశీ ఎపిసోడ్: ఆ ఎమ్మెల్యే కూడా టచ్‌లో ఉన్నారన్న బీజేపీ

తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న ప్రజల నమ్మకమే తనను గెలిపించిందని గంటా అన్నారు. తాను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే కృషి చేస్తామని చెప్పారు. ఇంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడానికి గల కారణాలను ఈనెల 29న జరగనున్న పార్టీ సమావేశంలో విశ్లేషించుకుంటామన్నారు. పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపి 2024లో పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. 

తాను పార్టీ మారతానంటూ వస్తున్న వార్లలన్నీ ఉట్టి పుకార్లేనని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌కు, శాసనసభ్యులకు ఈ సందర్భంగా గంటా అభినందలు తెలిపారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ మార్చ్‌కు దూరంగా ఉండటం ద్వారా గంటా శ్రీనివాసరావు ఇచ్చిన సంకేతానికి పర్యవసానం ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.