Asianet News TeluguAsianet News Telugu

జాగ్రత్త... రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమం..: కేంద్రానికి గంటా హెచ్చరిక

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికన కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 

Ex Minister Ganta Srinivas Rao Reacts on Vizag Steelplant Issue
Author
Visakhapatnam, First Published Feb 5, 2021, 11:58 AM IST

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలనుండి మరీముఖ్యంగా విశాఖ ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖప్రజలు ఉద్యమానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికన కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 

గంటా ఫేస్ బుక్ పోస్ట్ యదావిధిగా:

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస. మా నగరం పేరే ఉక్కు నగరం. ఉక్కు సంకల్పంతోనే సాధించుకున్నాం. విశాఖ ఉక్కు నుంచి విశాఖ ను వేరు చేయడం అంటే మా ప్రాణాల్ని మా దేహాల నుంచి వేరు చేయడమే. 

విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రుల, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీక. దయచేసి మా సెంటిమెంట్ ని ముట్టుకోవద్దు.1966 నుంచి దశాబ్దకాలం పాటు 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం,  32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు ఖాళీ, 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిధ్ధమే.

కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సొంత కాప్టివ్ ఐరన్ ఓర్ ఖనిజ వ్యవస్థ లేదు. దీన్ని బయట నుంచి కొనాల్సి రావడం వల్లే టన్నుకు 5,000 రూపాయల నష్టం వాటిల్లుతోందని స్టీల్ మినిస్ట్రీ చెబుతోంది. కాబట్టి వెంటనే సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలని మా డిమాండ్. అలా కాదని ముందుకెళ్తే ఢిల్లీ లో జరుగుతోన్న రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమాన్ని, తీవ్రతని చవిచూడాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios