టికెట్ రాని వాళ్లే అదృష్టవంతులు.. ఈ రాజకీయాల్లో ఖర్చు తప్ప రాబడి నిల్ : దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత , మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గతంలో గెలిచినా సంపాదించుకునే ప్రయత్నం చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్ధితులు లేవని వెంకటేశ్వరరావు తెలిపారు.
ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత , మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దొరకనివాళ్లంతా అదృష్టవంతులేనని పేర్కొన్నారు. బుధవారం కారంచేడు మండలం కుంకలమర్రులో రుద్రభూమి మహాప్రస్థానం ప్రారంభోత్సవంలో దగ్గుబాటి పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .. ఇప్పుడున్న రాజకీయాల్లో గెలవడానికి కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్ధితి నెలకొందన్నారు.
గతంలో గెలిచినా సంపాదించుకునే ప్రయత్నం చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్ధితులు లేవని వెంకటేశ్వరరావు తెలిపారు. అంతేకాదు.. ఎమ్మెల్యేగా ఎన్నికైనా ప్రజలకు సేవ చేసే అవకాశం లేదని, పార్టీ అధినేతలు ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా రాబడిని సెంట్రలైజ్ చేసుకున్నారని దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు .
ఎటువంటి వాటి ద్వారా డబ్బు వస్తుందో పార్టీ అధినేతలే పెత్తనం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ రానివాళ్లే అదృష్టవంతులని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వారికి రూ.30 నుంచి రూ.40 కోట్లు మిగిలినట్లేనని తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఎన్నికల్లో ఖర్చుచేసి పిల్లల్ని రోడ్డు పాలు చేయొద్దని దగ్గుబాటి హితవు పలికారు. ప్రస్తుత రాజకీయాల్లో తాము ఇమడలేమని వెంకటేశ్వరరావు అన్నారు.