Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రదేశంలో ఆమరణ దీక్ష చేస్తా.. చావడానికైనా సిద్దమే: అఖిలప్రియ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్ చేసిన ప్రాంతంలో ఆమరణ నిరహార దీక్షకు దిగుతామని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

ex minister bhuma akhila priya says we will go for hunger strike in Nandyal over Chandrababu Naidu Arrest ksm
Author
First Published Sep 21, 2023, 4:11 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్ చేసిన ప్రాంతంలో ఆమరణ నిరహార దీక్షకు దిగుతామని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అయితే తమ దీక్షకు అనుమతి ఇవ్వకపోతే ఎస్పీ, డీఎస్పీ కార్యాలయాల్లో దీక్ష చేస్తానని చెప్పారు. గురువారం అఖిలప్రియ నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన చోటు ప్రైవేట్ ప్రాంతమని.. తాము అక్కడ దీక్ష చేయాలని నిర్ణయించామని.. ఇందుకు పోలీసుల అనుమతి  కూడా కోరినట్టుగా చెప్పారు. అయితే పోలీసులు తమకు అనుమతి ఇచ్చేందుకు సిద్దంగా లేరని  అన్నారు.  

తమ దీక్షకు అనుమతి ఇవ్వకపోతే నంద్యాల ఎమ్మెల్యే భయపడ్డారని ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు. తాను, తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి శాంతియుతంగా దీక్ష చేపట్టాలని అనుకుంటున్నామని.. ఇందుకు ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. తమ దీక్షను అడ్డుకుని ఇబ్బందులకు గురిచేస్తే.. పోలీసుల నుంచే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినట్టుగా అవుతుందని చెప్పారు. తప్పు వారి వైపు ఉంది కాబట్టే దీక్షకు అడ్డు చెబుతున్నారని అన్నారు. తమను అడ్డుకుంటే వారికే చెడ్డ పేరు వస్తుందని.. తాము చావడానికైనా సిద్దమేనని అన్నారు. 

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లు, దౌర్జన్యాలు ఆగిపోవాలనే తాము దీక్ష చేయనున్నట్టుగా చెప్పారు. తాము ఇబ్బందులు పడుతూ కూడా పోరాటం చేస్తుందని తమ కోసమం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మహిళల భద్రత కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల కోసమే తాము ఇదంత చేస్తున్నామని చెప్పారు. 

ప్రజల కోసం పోరాటాలు చేయాలని చంద్రబాబు, లోకేశ్ పిలుపునిచ్చారని.. అందుకే తాము బయటకు వస్తున్నామన్నారు. కొంతమంది బుర్రలేని వ్యక్తులు తనను ఆళ్లగడ్డలో ఆందోళన చేసుకోవాలని చెబుతున్నారని.. కానీ ఇది ఆళ్లగడ్డకో, నంద్యాలకో సంబంధించిన అంశం కాదని.. ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశమ అని అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు కూడా బయటకు వస్తున్నారని అన్నారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. ఈ వయస్సులో చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, చన్నీళ్లతో స్నానం చేయించే పరిస్థితి తెప్పించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇంత శాడిజం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వయస్సుకు, ఆయన రాజకీయ అనుభవానికి కూడా మర్యాద ఇవ్వడం లేదన్నారు. ఏపీలో కక్ష సాధింపు, రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. చంద్రబాబును నంద్యాల నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు కనకే తాము ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని నిర్ణయించామన్నారు. తాము చావడానికైనా సిద్ధమే కానీ.. దీక్షపై వెనక్కి తగ్గేదే లేదన్నారు. తమకు అనుమతి ఇవ్వకుంటే ఎస్పీ, డీఎస్పీ కార్యాలయాల్లో దీక్ష చేస్తామని అఖిలప్రియ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios