నెల్లూరు సిటీ వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాసేపట్లో పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీకానున్నారు. నెల్లూరులో అనిల్ , రూప్ కుమార్ యాదవ్ వర్గాల మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
నెల్లూరు సిటీలో వైసీపీ నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ వర్గాల మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై గత వారం తన వర్గీయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన అనిల్.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ పరిస్థితుల్లో అనిల్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తన వర్గీయులతో కలిసి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నియోజకవర్గంలో పరిణామాలన్నీ తనకు వ్యతిరేకంగా మారుతుండటంతో అనిల్ కుమార్ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇద్దరు నేతలకు తాడేపల్లికి రావాల్సిందిగా హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సోమవారం అనిల్ కుమార్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు.
ALso Read: ఊపిరి వున్నంత వరకు జగన్‌తోనే.. 2024లోనూ వైసీపీ అభ్యర్ధిని నేనే , గెలిచేది నేనే : అనిల్ కుమార్ యాదవ్
కాగా.. అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. వారిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే, నెల్లూరు సిటీ నియోజకవర్గం వైసీపీలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. నెల్లూరు సిటీలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది.
నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నూడా చైర్మన్ ద్వారకానాథ్‌లు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు దూరం అయ్యారు. రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లతో కూడా అనిల్‌కు సఖ్యత లేదు. ఇక, రూప్ కుమార్ యాదవ్ అయితే ఏకంగా ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలను అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. అక్కడి నుంచి ఎటువంటి స్పందన లభించలేదని తెలుస్తోంది. మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్ష పదవిని అప్పగించింది. ఈ నియామకం సమయంలో అనిల్ కుమార్ యాదవ్‌ను పార్టీ సంప్రందిచలేదని ఆయన వర్గం గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే ఒకరి బలహీనతలు మరొకరు బయటపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
