ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదలం : అనిల్ కుమార్ యాదవ్
ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కేసులు తప్పవని వైసీపీ ప్రభుత్వం నిరూపించిందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ కేసులో చంద్రబాబు ముమ్మాటికీ ముద్దాయేనని వ్యాఖ్యానించారు. సీఎంగా చేసిన వ్యక్తి మీద అక్రమంగా కేసులు పెట్టారని పురందేశ్వరి వ్యాఖ్యానించాడం దారుణమని అనిల్ కుమార్ దుయ్యబట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ స్కాంలో నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయొద్దా అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకుంటారా అని నిలదీశారు.
చంద్రబాబు అరెస్ట్ పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందనా లేదని.. అందుకే పవన్‌ను తీసుకొచ్చి హంగామా సృష్టిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఇన్‌కం ట్యాక్స్ అక్రమాలు, అమరావతిలో అవినీతి అంశాలు కూడా ఇందులో వున్నాయని ఆయన తెలిపారు. అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించిన తర్వాతే అధికారులు కేసు నమోదు చేశారని.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కేసులు తప్పవని వైసీపీ ప్రభుత్వం నిరూపించిందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ALso Read: మళ్ళీ మొదలైన చంద్రబాబు అరెస్ట్ కేసు విచారణ... సర్వత్రా ఉత్కంఠ..!
అంతకుముందు మంత్రి రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు లేకపోతే కేసు నిలబడదని అన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత విచారణలో చాలా పేర్లు, వివరాలు బయటకు వస్తాయని అన్నారు. చంద్రబాబు మీద కక్ష సాధించాలంటే సీఎం జగన్ నాలుగేళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు తప్పు చేసి దొరికిపోయాడని.. అందుకే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి దేవుడిని వేడుకోవటం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై భువనేశ్వరి, బ్రాహ్మణికి ఎలాంటి బాధ లేదన్నారు. ఎన్టీఆర్‌ను పొట్టనబెట్టుకున్నప్పుడే ఆయన కూతుళ్లుకు, కుటుంబానికి బాధ లేదని విమర్శించారు. ఎన్టీఆర్ కుమార్తెలకు తన తండ్రిని హిసించినా ఎటువంటి ఎమోషన్స్ లేవని అన్నారు. నాడు ఎన్టీఆర్ ను వేధించిన వ్యక్తిని ఇప్పుడు విధి సమాధానం చెప్పిందని రోజా చెప్పుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తోందని అన్నారు.