తమను తొలగించి.. వేరేవారికి మంత్రిపదవులు ఇవ్వడంపై కొందరు మాజీ మంత్రుల్లో ఇప్పటికీ అసంతృప్తి ఉన్న బయటకు చెప్పుకోలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం నెల్లూరు వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు నేతల్లో అసంతృప్తి ఉన్న మాటే నిజమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. అయితే చాలా వరకు అవి సద్దుమగిణాయి. పలువురు నేతలు సీఎం జగన్‌తో భేటీ తర్వాత కామ్ అయిపోయారు. అయితే తమను తొలగించి.. వేరేవారికి మంత్రిపదవులు ఇవ్వడంపై కొందరు మాజీ మంత్రుల్లో ఇప్పటికీ అసంతృప్తి ఉన్న బయటకు చెప్పుకోలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం నెల్లూరు వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు నేతల్లో అసంతృప్తి ఉన్న మాటే నిజమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రమాణ స్వీకారానికి కాకాణి తనను ఆహ్వానించలేదని చెప్పారు. అంతేకాకుండా కాకాణి గోవర్దన్‌ రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎంత గౌరవం ఇచ్చారో.. తాను ఇప్పుడు రెట్టింపు గౌరవం ఇస్తానని అనిల్ కుమార్ యాదవ్ సెటైరికల్‌గా మాట్లాడారు. 

ఇక, తాజాగా మంత్రి కాకాణికి స్వాగతం పలికేరోజునే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండడంపై నెల్లూరులో జోరుగా చర్చ సాగుతోంది. అయితే కాకాణి గోవర్దన్ రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్‌కు మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అయితే తాజాగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో చోటుచేసుకున్న పరిణామాలు వారి మధ్య విభేదాలను బహిర్గతం చేశాయని నెల్లూరు వైసీపీలో చర్చ సాగుతుంది. 

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి.. రేపు(ఏప్రిల్ 17) తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మరోవైపు అదే రోజు సాయంత్రం 5 గంటలకు నెల్లూరులో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనిల్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేయాలని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. దీంతో నెల్లూరు వైసీపీలో వర్గ విబేధాలు బహిర్గతం అయ్యాయి. 

అయితే తాను సభ నిర్వహించడానికి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎవరికీ పోటీ సభ కాదని.. బల ప్రదర్శన కోసం ఈ సమావేశం నిర్వహించడం లేదని చెప్పారు. కేవలం సిటీ నియోజకవర్గం కార్యకర్తలు మాత్రమే ఈ సభకు హాజరవుతారన్నారు. మూడు రోజుల ముందే సభకు అనుమతి కోరినట్టుగా చెప్పారు. తన సభను కొందరు వివాదంగా మారుస్తున్నారని అన్నారు. తాను జగన్‌కు సైనికుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. తన సభను వాయిదా వేసుకోవాలని అధిష్ఠానం సూచించలేదని చెప్పారు. 

మరోవైపు ఇటీవలే అనిల్‌ కుమార్‌ యాదవ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గిరిధర్ రెడ్డితో సమావేశమయ్యారు. వారు దాదాపు రెండు గంటలపాటు రహస్యంగా చర్చలు జరిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అయితే అనిల్ ఎన్ని చెబుతున్న కాకాణితో విభేదాలతోనే పోటీగా సభను ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. దీంతో నెల్లూరు వైసీపీలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ సాగుతుంది.