సారాంశం
ఇతర రాష్ట్రాల జనం ఏపీ గురించి నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ బహిష్కృత నేత ఆనం రాం నారాయణ రెడ్డి. హైదరాబాద్‌కు వెళ్లిన ఆంధ్రులు.. కోడి పందేలకు కూడా ఏపీకి రావడం లేదన్నారు.
వైసీపీ పాలనపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు వెళ్లిన ఆంధ్రులు.. కోడి పందేలకు కూడా ఏపీకి రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అధికారం లేదని .. వాలంటీర్‌కు వున్న అధికారం ఇక్కడ ఎమ్మెల్యేకి లేదన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అసెంబ్లీ నుంచి గ్రామ పంచాయతీ సమావేశాల వరకు దేనికీ విలువ లేకుండా పోయిందని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా తెస్తున్నారని.. ఆ లెక్కన రాష్ట్రానికి ఎంత అప్పు అయ్యుంటుందని రాం నారాయణ రెడ్డి ప్రశ్నించారు. పవర్ ప్రాజెక్ట్‌లు అమ్మేసి స్ధితికి వచ్చారని.. పోలవరం నిర్మాణాన్ని పక్కనబెట్టారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముందే 99 ఏళ్ల లీజుకు ఇచ్చేశారని.. ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారని ఆనం రాం నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో ఇవాళ లే ఔట్లు లేవని.. తెలంగాణలో వ్యాపారాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అమరావతి పేరుతో ఏపీకి వచ్చిన వాళ్లంతా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారని ఆనం రాం నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.