టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కుదరకపోతే తిరుపతిని రాజధానిగా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అది కుదరకపోతే చిత్తూరు జిల్లాను తమిళనాడు లేదా కర్ణాటకలో కలపాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. అయితే అలా చేస్తే కనుక తిరుపతి తమిళనాడులోకో.. కర్ణాటకలోకో వెళ్లిపోతుందని మేధావులు చెబుతున్నారు.

Also Read:ఆ తప్పును సరిదిద్దుతాం: రాజధాని‌పై జగన్ కీలక వ్యాఖ్యలు

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిద్రపోతున్నారా అని ఆయన ఫైరయ్యారు.

పాలనా వికేంద్రీకరణ గురించి జగన్ 2014లోనే మాట్లాడొచ్చు కదా అని అమర్‌నాథ్ రెడ్డి ప్రశ్నించారు. ఆ రోజే విశాఖ, కర్నూలు, అమరావతిలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి చెప్పి ఉండొచ్చు కదా అని ఆయన చురకలంటించారు.

Also Read:అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: వైసీపీకి బొండా ఉమా సవాల్ ఇదీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని.. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్లుగా వ్యవహారం తయారైందని అమర్‌నాథ్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్ర విభజన సమయంలోనే చిత్తూరు జిల్లాను విడదీయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చామని ఆయన గుర్తుచేశారు. హేరిటేజ్, చంద్రబాబుపై బురద జల్లి, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. తిరుపతిని రాజధాని చేయకుంటే ఉద్యమం తప్పదని అమర్‌నాథ్ రెడ్డి హెచ్చరించారు.