టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడంతో తాడిపత్రి పట్టణం రణరంగమైంది. దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం కంగారుపడ్డారు. తాడిపత్రిలో అర్థరాత్రి వరకు పోలీసుల హడావిడి, టీడీపీ నేత చింతమనేనిని అడ్డుకోవడంతో పరిస్ధితి క్రిటికల్‌గానే కనిపించింది.

అయితే ఈ రోజు తాడిపత్రి రోజూలాగే ప్రశాంతంగా వుంది. కాగా ఈ ఘటనపై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. తాడిపత్రిలో పెద్దిరెడ్డి, జేసీ ఇద్దరిది తప్పేనని తేల్చిచెప్పారు.

పెద్దారెడ్డి రచ్చకు పోయి చర్చలకు వెళ్లానని చెప్పడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. పెద్దారెడ్డికి ప్రత్యక్షంగా పోలీసుల సహకారం ఉందని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ సంస్కృతి పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆది స్పష్టం చేశారు. 

కాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి పెద్దారెడ్డి వెళ్లడం, దీనిపై ఇరువర్గాల మధ్య సాగిన భీకర రాళ్ల దాడులతో తాడిపత్రి ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంట్లోకి  కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారు.

ఇళ్లంతా కలియతిరుగుతూ వీరంగం సృష్టించారు. అక్కడున్న జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా.. అక్కడే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్‌చల్‌ చేశారు.

దీనిపై భగ్గుమన్న జేసీ వర్గీయులు. పెద్దారెడ్డి లేచిన తర్వాత ఆ కుర్చీని కాల్చేశారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డు అయింది.