పార్టీ మార్పుపై స్పందించారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. విజయవాడలో జరుగుతున్న టీడీపీ వర్క్‌షాప్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తాను బీజేపీలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని..  ఈవీఎంల వల్లే టీడీపీ ఓడిపోయిందని ఆది ఆరోపించారు. ఈవీఎంలలో అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని.. సోనియా, శరద్‌పవార్ కూడా ఈవీఎంల అక్రమాలపై పోరాటం చేస్తారని ఆయన తెలిపారు.

చంద్రబాబు ఆదేశాలతోనే తాను ఎంపీగా పోటీ చేశానని.. రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు టిక్కెట్ కేటాయింపు కోసం తనను ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు కోరారని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీడీపీ చేసిందన్నారు. రామసుబ్బారెడ్డి, తాను కలిసినా ఓడిపోవడం వెనుక బలమైన కారణాలున్నాయని ఆది అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిస్తే మనకు ఇబ్బందని కొందరు భావించారని ఆయన ఆరోపించారు.

వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని.. పార్టీని పున:నిర్మిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.