రాష్ట్ర సమస్యలపై ఎవరు పోరాడినా మద్ధతిస్తామన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న లాంగ్‌మార్చ్ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

జగన్ పాలనలో ఇసుక సత్యాగ్రహం చేయాల్సి వస్తోందని.. లారీ ఇసుకను రూ.50 వేలకు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. ఇసుక సమస్యపై పార్టీలకతీతంగా పోరాడాలని అయ్యన్న పిలుపునిచ్చారు.

ఇసుక కొరతతో భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని.. తన రాజకీయ జీవితంలో ప్రజాసమస్యలపై స్పందించని సీఎంను ఎప్పుడూ చూడలేదన్నారు. ఐదు నెలలుగా ఉపాధి లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు. 

Also read:జనసేన లాంగ్‌మార్చ్‌లో అపశృతి: షార్ట్‌సర్క్యూట్, కార్యకర్తలకు గాయాలు

మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఇసుక కొరతను సృష్టించింది ప్రభుత్వమేనని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని.. భవన నిర్మాణ కార్మికులను నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల ఆత్మహత్యలకు సర్కార్‌దే బాధ్యతని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ఐదు నెలల్లో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని.. రాష్ట్రం నుంచి ఇసుక హైదరాబాద్‌కు తరలిపోతోందని ఆయన ఆరోపించారు. 

ఇసుక సమస్య ఈ స్థాయిలో విజృంభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం అనుకుని ఉండదన్నారు జనసేన నేత, సినీనటుడు నాగబాబు. విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Also Read:ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. పీకల మీదకి తెచ్చింది: నాగబాబు

ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వం గొంతుమీదకు వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని.. అయితే కోటిమందికి పైగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని.. వారి విలువను ప్రభుత్వం గుర్తించలేకపోయిందని నాగబాబు ఎద్దేవా చేశారు.

కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం ఇద్దామని పవన్ అన్నారని అయితే జగన్ సర్కార్‌కు అంత ఓపిక లేదేమోనంటూ దుయ్యబట్టారు. ఆరు నెలల్లోనే తమకు పని కల్పించినందుకు వైసీపీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇసుక సమస్యను పదిరోజుల్లో పరిష్కరించేందుకు జనసేన వద్ద మంచి ప్లాన్ ఉందన్నారు. కర్ణాటకలో పవన్ భద్రత కోసం అక్కడి ప్రభుత్వం 900 మంది పోలీసులను కేటాయిస్తే.. మన ప్రభుత్వం కేవలం 70 మందిని మాత్రమే కేటాయించిందని నాగబాబు విమర్శించారు.

ఎలాగైనా ఈ బహిరంగసభను జరగనివ్వకూడదని ప్రభుత్వం భావిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంబంధించి పరిహారం చెల్లించాలని నాగబాబు డిమాండ్ చేశారు.

మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్ధిక సాయం చేస్తున్నట్లుగానే భవన నిర్మాణ కార్మికులకు సైతం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చర్యల వల్ల ఇప్పటికే 8 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికైనా సర్కార్ చర్యలు తీసుకోవాలన్నారు.