కేవలం నెలరోజుల్లోనే ఏపీ సీఎం జగన్ పాలన ఏలా ఉంటుందో తెలిసిపోయిందని మాజీ డిప్యుటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన చినరాజప్ప... నూతన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. జగన్ కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. ‘జగన్ సర్కార్.. ఇది కూల్చి వేతల ప్రభుత్వం’ అని చినరాజప్ప చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నదీ తీరాల్లో వేల సంఖ్యలో ప్రభుత్వ, ప్రయివేటు భవనాలు ఉన్నాయని.. వాటన్నింటినీ కూలుస్తారో లేదో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు నివాసం ఉంటున్న బిల్డింగ్‌కు అన్ని అనుమతులూ ఉన్నాయన్నారు. తెలంగాణా సీఎంతో వైఎస్ జగన్ దోస్తీ, జరుగుతున్న పరిణామాలు ఏపీ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగేలా ఉన్నాయన్నారు. రాజధాని, పోలవరం పనులు ఆపేశారని.. ఇలా అన్నింటా కక్ష సాధింపు సమీక్షలంటూ అభివృద్ధిని గాలికి వదిలేశారని రాజప్ప చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఓ జర్నలిస్ట్‌పై నరుకుతా.. చంపుతా అంటూ వాడిన దుర్భాష వైసీపీ నేతల తీరుకు నిలువుటద్దమని చినరాజప్ప చెప్పుకొచ్చారు.