గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఏం తప్పు చేశాడని గల్లా జయదేవ్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు.

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అసెంబ్లీ ఎదుట గల్లా జయదేవ్ ధర్నా చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో గల్లా జయదేవ్ చొక్కాను సైతం చింపేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన ఒంటిపై దెబ్బలు కూడా బాగా కనిపిస్తున్నాయి.

వాటికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన చంద్రబాబు... గల్లా చేసిన తప్పేంటో చెప్పాలని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేంత తప్పు జయదేవ్ ఏం చేసారు? ఆయనపై పెట్టిన అక్రమకేసుల్ని పోలీసులు వెనక్కి తీసుకోవాలి. ఎంపీ జయదేవ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జయదేవ్ ను వెంటనే విడుదలచేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

మరో ట్వీట్ లో ‘‘ ఒక ఎంపీ అన్న గౌరవం కూడా లేకుండా తెదేపా నేత గల్లా జయదేవ్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు అన్యాయం జరుగుతుంటే మద్దతుగా నిలవడం తప్పా. మీలా నమ్మిన ప్రజలను మోసం చేసే చరిత్రహీనులం కాదు. ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజల కోసం నిలబడతాం.’’ అని పేర్కొన్నారు.

కాగా... సోమవారం గల్లా జయదేవ్ ని పోలీసులు అరెస్టు చేయగా... అక్కడి నుంచి పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. మంగళవారం మంగళగిరి మెజిస్ట్రేట్ ముందకు హాజరు పరిచారు. కాగా... ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు మెజిస్ట్రేట్ కూడా నిరాకరించారు. దీంతో ఆయనను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.