తిరుపతి: సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అత్యాచారాంధ్ర ప్రదేశ్ గా మార్చారని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు. మహిళా హోంమంత్రిని కేవలం ఉత్సవ విగ్రహంగా మిగిల్చారని అన్నారు. రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళాకమిషన్ ఏం చేస్తోంది..?అని పనబాక లక్ష్మీ నిలదీశారు.

''రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రే అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చివేశారు. 18 నెలల కాలంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి, రాళ్లతోకొట్టి ఆమె దేహాన్ని చిధ్రం చేస్తే సీఎం కనీసం మానవత్వంతో కూడా స్పందించలేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

''ఆ ఘటన మరువక ముందే అనంతపురం జిల్లా ధర్మవరంలో మరో దిశ తరహా హృదయ విదారకర ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. తమ కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని 10 రోజుల కిందటే స్నేహలత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి అఘాయిత్యం జరిగింది. పైగా ఇళ్లు మారిపోండి లేదంటే మిమ్మల్ని వారు వదిలిపెట్టరని సాక్షాత్తూ పోలీసులే మృతురాలి తల్లిదండ్రులను బెదరించడం సిగ్గుచేటు. పోలీసుల వ్యవహారశైలిపై డీజీపీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది'' అని మండిపడ్డారు. 

read more   స్నేహలత దారుణ హత్యకు కారణమదే..: పవన్ కల్యాణ్ సీరియస్

''మహిళలపై అత్యాచార ఘటనల్లో 21 రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని తెచ్చిన దిశ చట్టం ఏమైంది..? మీ అరాచక పాలనలో మహిళా హోంమంత్రిని కేవలం ఉత్సవ విగ్రహంగా మార్చేశారు. ఘటనపై ఎస్సై, ఎస్పీ వంటి వారు ఎందుకు చర్యలు తీసుకోలేదో డీజీపీ, మహిళ హోం మంత్రి సమాధానం చెప్పాలి'' అని నిలదీశారు.

''యువతిని హత్య చేసిన రాజేష్, కార్తీక్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలి. లేకుంటే దళితుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులక మానదు'' అని మాజీ కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.