గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 1573 కేటాయించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనను చికిత్స నిమిత్తం జిజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. 

ఇదిలావుంటే, అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడి అరెస్టు అవినీతిపై ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమేనని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తున్నప్పుడు దమ్ముంటే విచారణ జరిపించాలని, చేతనైతే కేసులు పెట్టాలని చంద్రబాబు మాట్లాడుతారని ఆయన గుర్తు చేస్తూ ఈఎస్ఐ కుంభకోణంలో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడిపై ఏసీబీ దర్యాప్తు చేస్తే మాత్రం రాజకీయ కక్ష అంటున్నారని ఆయన అన్నారు. బీసీ రంగులు అద్దుతున్నరని ఆయన విమర్శించారు. 

రివర్స్ టెండరింగ్ తో రూ.2200 కోట్లు ఆదా చేసి అప్పట్లో ఎంతటి అవినీతి జరిగిందే బయటపెట్టిన తర్వాత చర్యలు తీసుకోవడంలో తప్పేముందని అడిగారు. అచ్చెన్నాయుడి అరెస్టు అవినీతి చర్యలపై ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమేనని సజ్జల అన్నారు. 

ఇదిలావుంటే, ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి హెల్త్ బులిటెన్ విడుదలైంది. సుదీర్ఘ ప్రయాణం కారమంగా గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జిజీహెచ్ సూపరింటిండెంట్ సుధాకర్  చెప్పారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆయన అన్నారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

గాయం తగ్గడానికి రెండు మూడు రోజులు వట్టవచ్చునని, బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులను కొనసాగిస్తున్నామని డాక్టర్ సుధాకర్ చెప్పారు. షుగర్ సాధారణ స్థితిలోనే ఉందని అన్నారు.