ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి మంత్రి జయరాం కుమారుడు కారు గిఫ్ట్‌గా పొందారన్న ఆరోపణలతో ఏపీలో పెను దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే

ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి మంత్రి జయరాం కుమారుడు కారు గిఫ్ట్‌గా పొందారన్న ఆరోపణలతో ఏపీలో పెను దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈఎస్ఐ స్కాంలో ఏ 14 తెలకపల్లి కార్తీక్ స్పందించారు. తాను బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చాననేది ఆరోపణలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ తనకు స్నేహితుడు మాత్రమేనని కార్తీక్ చెప్పారు.

స్నేహంలో భాగంగా కొత్త కారుని ఈశ్వర్ చేతుల మీదుగా తీసుకున్నానని ఆయన వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో కారును కొన్నానని.. ఈఎస్ఐ కేసు 2009లో నమోదైందని, తనను జూలైలో ఏసీబీ అరెస్ట్ చేసిందని తెలకపల్లి గుర్తుచేశారు.

Also Read:ఆ కారు నాది కాదు, నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: మంత్రి జయరాం సవాల్

తనకు ప్రభుత్వం నుంచి ఇంకా రూ.1.50 కోట్ల బకాయి రావాల్సి వుందని ఆయన వెల్లడించారు. తాను అరెస్ట్ కావడం, ఈఎమ్ఐ చెల్లించకపోవడం వల్లే కారును సీజ్ చేశారని కార్తీక్ తెలిపారు.

ప్రస్తుతం కారు హైదరాబాద్‌ పంజాగుట్టలోని ననేశ్ ఫైనాన్స్ కంపెనీ వద్ద వుందని తెలకపల్లి పేర్కొన్నారు. మంత్రికి కారు బహుమతిగా ఇస్తే అక్కడ ఎందుకు వుంటుందని ఆయన చెప్పారు.