చీరాల: స్నేహితుల ముందు అవమానం జరగడంతో తీవ్ర మరస్థాపానికి గురయిన యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఎగ్జామ్ సెంటర్ లో తోటి విద్యార్థుల ముందు తనిఖీ చేయడమే కాదు డిబార్ చేయడంతో మనస్థాపానికి గురయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.  

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నాగరాజు-ఇందిర దంపతుల కుమారుడు ఎలీషా(19). ఇతడు  చీరాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 

సోమవారం నుండి కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) పరీక్ష జరుగుతున్న సమయంలో స్క్వాడ్ వచ్చి స్లిప్పులు పెట్టినట్లు అనుమానం వచ్చిన విద్యార్థులను తనిఖీ  చేశారు. ఇలా ఎలీషా ను కూడా తనిఖీ చేశారు. అతడి వద్ద స్లిప్పులు వున్నాయన్న అనుమానంతో ప్యాంట్ విప్పించి మరీ తనిఖీ చేశారు. స్లిప్పులు లభించడంతో పరీక్ష రాయనివ్వకుండా బయటకు పంపి డిబార్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎలీషా తీవ్ర మనస్థాపానికి గురయిన ఎలీషా దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

పరీక్షా కేంద్రంనుండి నేరుగా రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లిన అతడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చీరాల హాస్పిటల్ కు తరలించారు.