Asianet News TeluguAsianet News Telugu

ఎన్‌ఆర్‌ఐ, అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రులతో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యూమెంట్స్ స్వాధీనం..!

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్ ఆస్పత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు ముగిసినట్టుగా తెలుస్తోంది. 

Enforcement Directorate officers leave NRI Hospital
Author
First Published Dec 3, 2022, 2:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్ ఆస్పత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు ముగిసినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం రోజున 8 గంటల పాటు విచారణ చేపట్టిన సోదాలు నిర్వహించిన అధికారులు.. శనివారం మరోసారి సోదాలు జరిపారు. కొద్దిసేపటి క్రితం ఎన్నారై ఆస్పత్రి నుంచి ఈడీ అధికారులు వెళ్లిపోయారు. అయితే సోదాల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్‌ఆర్ఐ మెడికల్ కాలేజ్ నుంచి రూ. 25కోట్లు అధికారులు గుర్తించినట్టుగా ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్ట్ చేసింది. ఎంబీబీఎస్, పీజీ సీట్ల ఫీజులు దారిమళ్లించినట్టుగా ఈడీకి ఆధారాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. గతంలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిపై నమోదైన పోలీసు కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి నిర్వహకురాలుగా ఉన్న అక్కినేని మణితో సహా 11 మంది ఆస్పత్రి డైరెక్లర్ల ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ల కాల్‌డేగా, ఆన్‌లైన్ లావాదేవీలను ఈడీ ఆరా తీయనుంది. అలాగే మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాల్సిందిగా కూడా ఈడీ అధికారులు సూచింనట్టుగా తెలుస్తోంది. ఇక, మణి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో డైరెక్టర్‌‌గా కొనసాగారు. 

ఇక, శుక్రవారం రోజున ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌కు సంబంధించి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, నళినీమోహన్, ఉప్పలపు శ్రీనివాసరావు నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్, కోవిడ్ సమయంలో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిధులను డైరెక్టర్ల ఖాతాల్లోకి మళ్లించడం వంటి ఆరోపణలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రెండు ఆసుపత్రుల నుంచి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్కినేని ఆస్పత్రి నిర్మాణం, ఇతర  వ్యవహారాలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఈడీ అధికారులు ఆరా తీశారు. ఈ వ్యవహారంలో అక్కినేని మణి పాత్రపై వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఈడీ అధికారులు.. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో 2016 నుంచి అన్ని రికార్డులను పరిశీలిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2020, 2021 సంవత్సరాలలో ఆసుపత్రిలో కోవిడ్ -19 కోసం చికిత్స పొందిన 1,000 మందికి పైగా రోగుల వివరాలను ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నమోదు చేయలేదని శుక్రవారం సోదాల సందర్భంగా ఈడీ అధికారులు కనుగొన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చినకాకాని గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి కొత్త బ్లాక్‌ నిర్మాణానికి రూ. 43 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించకముందే చెల్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios