మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి స్కాంలో నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ కీలకపాత్ర: ఈడీ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో అవకతవకలకు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ కీలకపాత్ర పోషించారని సమాచారం.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు నిర్వహించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో స్కాంలో నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ కీలకపాత్ర పోషించారని ఈడీ గుర్తించిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ హైద్రాబాద్ లో ఉన్నట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి ఈ ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారులు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది భద్రత మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఆసుపత్రుల్లోని రికార్డులను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆసుపత్రుల్లోకి ఇతరులను ఎవరిని కూడ అనుమతించడం లేదు. అక్కినేని ఆసుపత్రికి చెందిన ఎండీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కరోనా సమయంలో ఆసుపత్రుల యాజమాన్యాలు అవకతవకలు పాల్పడినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మాన్యువల్ రశీదులు, నకిలీ రశీదులతో నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు మెడికల్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ సీట్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రేపు కూడా ఈడీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అమెరికాలో వైద్యురాలిగా ఉన్న అక్కినేని మణి విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. విదేశీ నిధులను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.