వైసీపీ ఎమ్మెల్యే కాకాణికి చుక్కెదురు

employees fire on ycp mla kakani govardhan reddy in nellore
Highlights

కలెక్టర్‌ను కించపరచే విధంగా మాట్లాడిన ఆయన  క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘాలు పట్టుపడితే.. కలెక్టర్‌ను అసభ్యంగా మాట్లాడినట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పటానికి అభ్యంతరం లేదని ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. 

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి చుక్కెదురైంది. కలెక్టర్ పై నిందాపరోణలు చేసినందుకు గాను.. ఆయనపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..జిల్లా కలెక్టర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్యే నిరాధార ఆరోపణలు చేశారు. దీంతో.. ఎమ్మెల్యేపై ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కసారిగా ముకుమ్మడి దాడి మొదలుపెట్టాయి. కలెక్టర్‌ను కించపరచే విధంగా మాట్లాడిన ఆయన  క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘాలు పట్టుపడితే.. కలెక్టర్‌ను అసభ్యంగా మాట్లాడినట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పటానికి అభ్యంతరం లేదని ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. 

కాగా.. ఈ మొత్తం వ్యవహారం పీఠముడిగా మారింది. రెండు రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. కాకాణి బేేషరతుగా క్షమాపణ చెబితేనే ఇంతటితో వ్యవహారానికి ముగింపు పలుకుతామని చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టరేట్‌ కార్యాలయం, అన్ని మండలాల్లోని తహశీల్దారు కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.

రేపు మూకుమ్మడి సెలవు.. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్‌కు సంఘీభావంగా ఉద్యోగ సంఘాలు మొత్తం మద్దతు తెలుపుతున్నాయని.. ఒక ఎమ్మెల్యే అధికారులతో వ్యవహరించే తీరు సరిగా లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అధికారులకు ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. 

కలెక్టర్‌కు రెవెన్యూ వర్గాలు, ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి రోజూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దిగొచ్చి క్షమాపణ చెప్పే వరకు ఇదే తీరులో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొనటం గమనార్హం.

loader