సీపీఎస్‌పై సమావేశానికి రాలేం.. ఏపీ ప్రభుత్వంతో చర్చలకు ఉద్యోగ సంఘాలు దూరం..
ఉద్యోగుల సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను మరోసారి ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం నిర్వహించే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఉద్యోగుల సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను మరోసారి ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో చర్చలకు అందుబాటులో ఉండాలని చెప్పింది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ కూడా చర్చలకు ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం నిర్వహించే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.
అయితే ఓపీఎస్‌పై చర్చిస్తేనే తాము చర్చలకు వస్తామని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తాము సీపీఎస్ సమావేశానికి హాజరు కావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఓపీఎస్‌పై చర్చిస్తేనే తాము చర్చలకు వస్తామని గత భేటీలోనే చెప్పామని తెలిపారు. తమకు ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చమని తాము ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా తెలిపారు. ఇతర రాష్ట్రాలు ఓపీఎస్‌కు వెళ్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు సాధ్యం కాదని అంటోందని ప్రశ్నించారు. ప్రభుత్వం జీపీఎస్‌ను మాత్రమే ఇస్తామంటే తాము చేయగలిగిందేమి లేదని అన్నారు.